గుజరాత్ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం
అహ్మదాబాద్, వెలుతురు, నవంబరు 17: తెలంగాణను ప్రపంచస్థాయి పారిశ్రామిక, పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఐటీ, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చాలన్న లక్ష్యంతో తెలంగాణ రైజింగ్-2047 విజన్‌ను రూపొందించామని వెల్లడించారు. ఈ ప్రగతి ప్రస్థానంలో గుజరాత్ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని, తమ వ్యాపార విస్తరణకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకోవాలని కోరారు.
డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు.
గుజరాత్ పారిశ్రామికవేత్తలతో మమేకం
అహ్మదాబాద్‌లోని తాజ్ స్కైలైన్ హోటల్‌లో సోమవారం తెలంగాణ ప్రభుత్వం, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ రోడ్‌షోలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గుజరాత్ పారిశ్రామికవేత్తలు దేశంలోనే అత్యంత బలమైన పారిశ్రామిక సంస్థలను నిర్మించారని, వారిలో చాలామంది ఇప్పటికే తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించారని పేర్కొన్నారు. అన్ని స్థాయిల పెట్టుబడులకు అనువైన పారిశ్రామిక వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పిస్తున్నామని తెలిపారు. గుజరాత్ వ్యాపారవేత్తలు తెలంగాణతో కలిసి ఎదగాలని, రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పెట్టుబడుల అవకాశాలపై ప్రజెంటేషన్
తెలంగాణలో అందుబాటులో ఉన్న పారిశ్రామిక మౌలిక వసతులు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, వివిధ రంగాల్లో అవకాశాలను రాష్ట్ర అధికారుల బృందం గుజరాత్ పారిశ్రామికవేత్తలకు వివరించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ శశాంక, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి ప్రజెంటేషన్లు ఇచ్చారు.
ఇప్పటికే తెలంగాణలో పరిశ్రమలు నిర్వహిస్తున్న సంస్థల ప్రతినిధులు తమ పెట్టుబడి అనుభవాలను వివరించారు. రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాల విస్తరణకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అనుకూలతలను ప్రస్తావించారు.
ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీలు
రోడ్‌షో అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు గుజరాత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఇంధన, ఔషధ, వస్త్ర, రసాయన, ఆహార శుద్ధి, సాంకేతిక రంగాలకు చెందిన సంస్థల ఉన్నతాధికారులతో చర్చించారు. తెలంగాణలో కొత్త పెట్టుబడులు పెట్టడం, ఇప్పటికే ఉన్న వ్యాపార కార్యకలాపాలను విస్తరించడం, రెండు రాష్ట్రాల మధ్య పారిశ్రామిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు.
కార్యక్రమంలో ఫిక్కీ గుజరాత్ రాష్ట్ర మండలి సభ్యుడు, బ్లూక్రాఫ్ట్ ఆగ్రో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిద్ధార్థ్ చౌధరి, ఫిక్కీ గుజరాత్ రాష్ట్ర మండలి డైరెక్టర్ బిజు నంబూదిరిలు కూడా పాల్గొన్నారు.
తెలంగాణ రైజింగ్-2047 దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా రాష్ట్రాన్ని మూడు ప్రత్యేక ఆర్థిక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), రూరల్ అండ్ అగ్రి రీజియన్ ఎకానమీ (రేర్) పేర్లతో ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పట్టణ ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేయడంతో పాటు, పట్టణ శివారు ప్రాంతాల్లో పారిశ్రామిక, మౌలిక వసతులను విస్తరించడం, గ్రామీణ, వ్యవసాయ రంగాల్లో ఆర్థిక అవకాశాలను మెరుగుపరచడం ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం.
డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’కు ‘రైజింగ్ టుగెదర్’ (కలిసి ఎదుగుదాం) అనే నినాదాన్ని ఖరారు చేశారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పారిశ్రామిక దిగ్గజాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం, కొత్త పారిశ్రామిక భాగస్వామ్యాలను నెలకొల్పడం ఈ సదస్సు లక్ష్యంగా పెట్టుకుంది.
