దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయ పరికరాలు

దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయ పరికరాలు

సిద్దిపేట, వెలుతురు, నవంబర్ 18 : హుస్నాబాద్ నియోజకవర్గంలోని వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత సహాయ పరికరాల పంపిణీ కోసం అలింకో సంస్థ ఆధ్వర్యంలో ఏడు మండలాల్లో ప్రత్యేక నిర్ధారణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అక్కన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన శిబిరాన్ని ఆయన ప్రారంభించి వినికిడి, ఆరోగ్య పరీక్షలను పరిశీలించారు. అర్హులకు ట్రై సైకిళ్లు, మోటరైజ్డ్ వాహనాలు, కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు తదితర ఉపకరణాలను ఉచితంగా అందిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ లబ్ధి చేకూరేలా ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. హుస్నాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయిస్తున్నామని, అక్కన్నపేట–హుస్నాబాద్ నాలుగు లైన్ల రహదారి పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్ల భూసేకరణకు రూ.250 కోట్లు కేటాయించి పరిహారం చెల్లించామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ కళాశాల, 250 పడకల ఆసుపత్రి నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేసి హుస్నాబాద్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రేపు సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ఇందిరమ్మ చీరల పంపిణీ, ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.