ముంబయి పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం

ముంబయి పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం

ముంబయి, వెలుతురు, నవంబరు 18 : ‘‘మీ ప్రధాన కార్యాలయం ముంబయిలోనే ఉంచుకోండి.. తయారీ, వ్యాపార విస్తరణ, అభివృద్ధి కార్యకలాపాలను తెలంగాణలో చేపట్టండి’’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముంబయి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. తయారీ, సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యాపార విస్తరణకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవాలని కోరారు. ముంబయిలోని వర్లీలో ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌లో బుధవారం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సహకారంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026’ రోడ్‌షోలో మంత్రి ప్రసంగించారు. ముంబయి నుంచి పెట్టుబడులను తరలించుకురావాలన్నది తమ ఉద్దేశం కాదని, అక్కడి సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను కొనసాగిస్తూనే తెలంగాణలో ఉత్పత్తి, వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

తెలంగాణ, ముంబయి మధ్య తరతరాలుగా కొనసాగుతున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణకు చెందిన కార్మికులు, చేతివృత్తులవారు, వ్యాపారవేత్తలు ముంబయి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. రెండు ప్రాంతాల మధ్య దశాబ్దాలుగా వాణిజ్య, వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ‘‘శతాబ్దం క్రితం తెలంగాణ ప్రజలు ముంబయి భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముంబయి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాం’’ అని శ్రీధర్‌బాబు అన్నారు. సాంకేతిక రంగం, గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), డేటా సెంటర్లు, ఔషధ పరిశ్రమలు, వస్త్రాలు, దుస్తుల తయారీ, మీడియా, వినోద రంగాల్లో తెలంగాణలో విస్తృత అవకాశాలున్నాయని వివరించారు. రాష్ట్రంలోని పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యమున్న మానవ వనరులు, పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను వినియోగించుకుని వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకోవాలని ముంబయి పారిశ్రామికవేత్తలకు సూచించారు. డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026’లో పాల్గొనాలని ఆహ్వానించారు. పెట్టుబడులకు వేగంగా అనుమతులు మంజూరు చేసే టీజీ-ఐపాస్‌ విధానాన్ని వివరించారు. ముంబయి నుంచి తెలంగాణకు వచ్చే ప్రతి సంస్థకు ప్రత్యేక అధికారిని కేటాయిస్తామని మంత్రి ప్రకటించారు. పెట్టుబడులపై తొలి చర్చల నుంచి సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి ఆదాయం ఆర్జించే దశ వరకు ఆ అధికారి పూర్తి సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. పెట్టుబడిదారులకు అన్ని దశల్లో అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

ముంబయిలోని పారిశ్రామిక, వ్యాపార సంస్థలతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని శ్రీధర్‌బాబు చెప్పారు. ముంబయిలోని ఆర్థిక, కార్పొరేట్‌ రంగ బలాన్ని తెలంగాణలోని తయారీ సామర్థ్యాలు, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అవకాశాలతో అనుసంధానించడం ద్వారా పరస్పర ప్రయోజనాలు సాధించవచ్చని పేర్కొన్నారు. సీఐఐ మహారాష్ట్ర రాష్ట్ర మండలి ఉపాధ్యక్షురాలు ఆర్తి కూచిభట్ల తెలంగాణా ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) వైస్‌ ఛైర్మన్‌, ఎండీ శశాంక్‌, ఇన్వెస్ట్‌ తెలంగాణ సీఈవో బి. అజిత్‌రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ కమిషనర్‌ నిఖిల్‌ చక్రవర్తి తెలంగాణ ప్రతినిధి బృందంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు ముంబయికి చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో విడివిడిగా సమావేశమయ్యారు. పెట్టుబడి ప్రతిపాదనలు, వ్యాపార విస్తరణ ప్రణాళికలు, పరస్పర భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు.

ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026

‘రైజింగ్‌ టుగెదర్‌’ నినాదంతో డిసెంబరు 7 నుంచి 9 వరకు తెలంగాణలోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈ సదస్సు జరగనుంది. తెలంగాణ రైజింగ్‌-2047 లక్ష్యాలకు అనుగుణంగా 2034 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధి వ్యూహంలో భాగంగా రాష్ట్రంలో మూడు ప్రత్యేక ఆర్థిక మండళ్లను అభివృద్ధి చేస్తోంది. పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ (క్యూర్‌-CURE), పట్టణ పరిసర ప్రాంత ఆర్థిక వ్యవస్థ (ప్యూర్‌-PURE), గ్రామీణ, వ్యవసాయ ప్రాంత ఆర్థిక వ్యవస్థ (రేర్‌-RARE)ల ద్వారా అన్ని ప్రాంతాల్లో సమతుల్య అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రణాళికలు రూపొందించింది.