ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్‌ కారుకు ప్రమాదం

ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్‌ కారుకు ప్రమాదం

రంగారెడ్డి, వెలుతురు, నవంబర్ 18 : కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఆయన కారు ముందున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే బల్మూరి వెంకట్, ఆయన సతీమణి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.బల్మూరి వెంకట్ తన భార్యతో పాటు సోదరుడు చాణక్య, డ్రైవర్ శ్రీకాంత్‌తో కలిసి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో కొత్తూరు బైపాస్ సమీపంలోని దర్గా చౌరస్తా వద్దకు చేరుకోగానే ముందుగా వెళ్తున్న కోళ్ల లోడుతో కూడిన డీసీఎం వాహనాన్ని కారు వెనుక నుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. డ్రైవర్ శ్రీకాంత్, ఎమ్మెల్సీ సోదరుడు చాణక్యకు స్వల్ప గాయాలయ్యాయి. బల్మూరి వెంకట్, ఆయన సతీమణి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.