ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 లోగో, మస్కట్, బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి వాకిటి

ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 లోగో, మస్కట్, బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి వాకిటి

 

మధిర, వెలుతురు, నవంబర్ 18 :  తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026కు సంబంధించిన లోగో, మస్కట్, బ్రోచర్‌ను రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఖమ్మం జిల్లా మధిరలో ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, ప్రతిష్ఠాత్మకమైన ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం రాష్ట్రానికి దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు.

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

 

డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

 

క్రీడలు కేవలం పతకాల సాధనకే పరిమితం కావని, యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు.

 

తెలంగాణ యువత చదువులతోపాటు క్రీడల్లోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.

 

ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 విజయవంతానికి క్రీడాకారులు, క్రీడాభిమానులు, యువత, ప్రజలందరూ భాగస్వాములు కావాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.