బీసీల జనభేరి పోస్టర్ ఆవిష్కరించిన మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 19 : బీసీల హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం డిసెంబర్ 14న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న బీసీల జనభేరి సభను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం గాంధీభవన్‌లో బీసీల జనభేరి సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన బీసీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సభ ద్వారా బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టడం, బీసీ జనాభా వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయడం, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించడం వంటి ప్రధాన డిమాండ్లతో ఈ జనభేరి నిర్వహించనున్నట్లు ప్రచార కార్యక్రమాల ద్వారా వెల్లడవుతోంది.
బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించడంతో పాటు చట్టసభల్లోనూ తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్‌ను జాతీయ స్థాయిలో వినిపించేందుకు ఈ సభ వేదిక కానుంది. తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి బీసీ సంఘాల నాయకులు, ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, గుజ్జ కృష్ణ, టీపీసీసీ ఓబీసీ సెల్ కన్వీనర్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
