లింబాద్రిగుట్టలో టూరిజం టెంపుల్ గెస్ట్‌హౌస్‌కు శంకుస్థాపన
భీంగల్, వెలుతురు, నవంబర్ 20 : నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో టూరిజం టెంపుల్ గెస్ట్‌హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథులుగా హాజరై గెస్ట్‌హౌస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించే దిశగా ఈ గెస్ట్‌హౌస్ నిర్మాణం కీలకంగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, ఈరవత్రి అనిల్, సునీల్ రెడ్డి, అవినాష్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
