స్నేహ గ్రూప్‌పై ఐటీ దాడులు.. తెలుగు రాష్ట్రాల్లో 16 చోట్ల..
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 21 : స్నేహ గ్రూప్ సంస్థలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ సహా మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని కొండాపూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్నేహ గ్రూప్‌కు చెందిన కార్యాలయాలు, సంస్థలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
స్నేహ గ్రూప్ డైరెక్టర్లు దెంది రాంరెడ్డి, వరుణ్ రెడ్డి, స్నేహ నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సంస్థకు సంబంధించిన పెట్టుబడులు, బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, బ్యాలెన్స్ షీట్లు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీల్లో వ్యత్యాసాలు, పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఆధారాల సేకరణపై దృష్టి సారించినట్లు సమాచారం. ఈ క్రమంలో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
చిన్న స్థాయి నుంచి విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం
స్నేహ గ్రూప్ ప్రస్థానం 1981-82 ప్రాంతంలో ప్రారంభమైనట్లు సమాచారం. దెంది రాంరెడ్డి మలక్‌పేటలో ‘రామ్ రెడ్డి చికెన్ మార్కెట్’ పేరుతో చిన్న స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించారు. అనంతరం 1994లో ఈ వ్యాపారం స్నేహ ఫామ్స్‌గా రూపాంతరం చెందింది. క్రమంగా పౌల్ట్రీ రంగంలో విస్తరించి బ్రీడింగ్, హ్యాచరీలు, బ్రాయిలర్, లేయర్ ఫామ్స్, చికెన్ ప్రాసెసింగ్, హోమ్ డెలివరీ వంటి విభాగాల్లో కార్యకలాపాలు విస్తరించింది. పౌల్ట్రీతో పాటు చేపలు, పౌల్ట్రీ దాణా తయారీ, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్, ఎడిబుల్ ఆయిల్ రిఫైనింగ్ రంగాల్లోనూ సంస్థ పెట్టుబడులు పెట్టింది. సఫల బ్రాండ్ కింద వంట నూనెలు, సోయా ఉత్పత్తులతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దృష్టి
బ్రీడర్ సామర్థ్యాన్ని పెంచుకునే లక్ష్యంతో 2024లో సింగ్ పౌల్ట్రీ సంస్థను స్నేహ గ్రూప్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అలాగే, స్నేహ గ్రూప్‌కు చెందిన బ్రాయిలర్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థ మిట్సుయి అండ్ కో ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.
గతంలోనూ స్నేహ గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న కొన్ని సంస్థలపై ఐటీ తనిఖీలు జరిగినట్లు సమాచారం. 2023లో స్నేహ గోల్డ్ ప్రాపర్టీస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, 2006లో స్నేహ విల్లాస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన వ్యవహారాలు కూడా పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది.
స్నేహ గోల్డ్ ప్రాపర్టీస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో దెంది రాంరెడ్డి, వరుణ్ రెడ్డిలు డైరెక్టర్లుగా ఉండగా, సంస్థకు రూ.16.69 కోట్ల పెయిడ్-అప్ క్యాపిటల్ ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం జరుగుతున్న సోదాల్లో భాగంగా సంస్థల ఆదాయ వ్యయాలు, పెట్టుబడుల మూలాలు, ఆర్థిక లావాదేవీలు, పన్ను రిటర్న్‌లు, బ్యాలెన్స్ షీట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
