కనగల్ మండల అభివృద్ధికి రూ.74 కోట్లతో భారీగా పనులు

కనగల్ మండల అభివృద్ధికి రూ.74 కోట్లతో భారీగా పనులు

నల్లగొండ, వెలుతురు, నవంబర్ 26 :

 

నల్లగొండ జిల్లా కనగల్ మండల అభివృద్ధికి మహర్దశ పట్టనుంది. నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దాదాపు రూ.74 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా దర్వేశ్‌పురం రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, ఆలయ అభివృద్ధి, రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు మహిళా సంఘాల నూతన భవనాలను ప్రారంభించారు.

 

దర్వేశ్‌పురం రేణుక ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధి, సుందరీకరణ పనుల కోసం రూ.15 కోట్లతో చేపట్టనున్న పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ నిధులు వినియోగించనున్నారు.

 

అదేవిధంగా నల్లగొండ బైపాస్ రోడ్డు నుంచి మంచినీళ్ల బావి, దర్వేశ్‌పురం, చెర్ల గౌరారం మీదుగా సాగర్ రోడ్డు వరకు రూ.37 కోట్లతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరోవైపు నల్లగొండ–మహబూబ్‌నగర్ రోడ్డు నుంచి మైలసముద్రం మీదుగా తెల్లకంటి గూడెం వరకు రూ.21 కోట్లతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేశారు.

 

గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడంతో పాటు వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించే దిశగా దర్వేశ్‌పురంలో మహిళా సంఘాల నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. కనగల్ పట్టణంలో మరో రెండు మహిళా సంఘాల నూతన భవనాలను ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు.

 

ఒకే పర్యటనలో ఆలయ అభివృద్ధి, రహదారుల విస్తరణ, మహిళా సంఘాల భవనాల ప్రారంభోత్సవాలతో కనగల్ మండలంలో అభివృద్ధి పనులకు మంత్రి ప్రాధాన్యతనిచ్చారు.