వర్గల్‌లో రూ.1,500 కోట్లతో కాఫీ ప్లాంట్
సిద్దిపేట, వెలుతురు, నవంబర్ 26 : తెలంగాణలో పారిశ్రామిక పెట్టుబడులకు మరో కీలక ముందడుగు పడింది. సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లో రూ.1,500 కోట్ల భారీ పెట్టుబడితో ‘వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్’ సంస్థ ఏర్పాటు చేయనున్న అత్యాధునిక ఫ్రీజ్ డ్రైడ్ ఇన్‌స్టంట్ కాఫీ ప్లాంట్‌కు గురువారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు భూమిపూజ చేశారు. రెండు దశల్లో నిర్మించనున్న ఈ ప్లాంట్ ద్వారా సుమారు 1,000 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
మొదటి దశలో ఏటా 5,500 మెట్రిక్ టన్నుల ఇన్‌స్టంట్ కాఫీ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. దక్షిణాసియాలోనే తొలిసారిగా అత్యాధునిక రోటో టెక్నాలజీని వినియోగించి ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 2027 చివరి నాటికి రెండో దశ విస్తరణ పనులు పూర్తిచేసి ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 11,000 మెట్రిక్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ పరిశ్రమ 100 శాతం ఎగుమతుల ఆధారిత యూనిట్‌గా పనిచేయనుంది. ఇక్కడ తయారయ్యే ఇన్‌స్టంట్ కాఫీని యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా తదితర అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నారు. తద్వారా తెలంగాణ పారిశ్రామిక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించడంతో పాటు రాష్ట్రానికి ఎగుమతుల ద్వారా ఆదాయం సమకూరనుంది.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వర్గల్‌లో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్‌తో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత, ఉపాధి కల్పనతో తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని పేర్కొన్నారు.
