క్రీడాకారుల ప్రతిభకు పదును పెట్టడమే స్పోర్ట్స్ సైన్స్ లక్ష్యం : మంత్రి వాకిటి శ్రీహరి

క్రీడాకారుల ప్రతిభకు పదును పెట్టడమే స్పోర్ట్స్ సైన్స్ లక్ష్యం : మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 26: క్రీడాకారుల్లోని బలాలు, బలహీనతలను శాస్త్రీయంగా విశ్లేషించి, వారి ప్రతిభకు పదును పెట్టడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన ప్రీ–ఖేలో ఇండియా యూత్ గేమ్స్ స్పోర్ట్స్ సైన్స్ కాన్ఫరెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ…

 

గతంలో క్రీడాకారులు తమ వ్యక్తిగత నైపుణ్యంతో ప్రత్యర్థులను ఎదుర్కొనేవారని, ప్రస్తుతం కృత్రిమ మేధ (AI), ఆధునిక కెమెరాలు, డేటా విశ్లేషణ వంటి సాంకేతిక పరిజ్ఞానం క్రీడల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఒక క్రీడాకారుడు ఏ క్రీడలో రాణించగలడు, అతనిలోని లోపాలు ఏమిటి, ఏ అంశంలో ప్రోత్సాహం అందించాలనే విషయాలను స్పోర్ట్స్ సైన్స్ ద్వారా గుర్తించాలన్నారు. తన క్రికెట్ అనుభవాలను ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేసుకున్నారు.

 

అవకాశమే క్రీడాకారుడి జీవితాన్ని మార్చేస్తుంది

 

క్రీడాకారులకు ప్రతిభతో పాటు సరైన సమయంలో అవకాశం లభించడం ముఖ్యమన్నారు. భారత క్రికెటర్ తిలక్ వర్మ ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో తన ప్రతిభను నిరూపించుకున్న తీరును ఉదాహరణగా ప్రస్తావించారు. తెలంగాణ క్రీడాకారులకు కూడా అలాంటి అవకాశాలను కల్పించి ప్రోత్సహించాలన్నారు.

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో తెలంగాణకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ అవకాశం లభించిందన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

 

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.203 కోట్లు కేటాయించి క్రీడా మైదానాలు, మౌలిక సదుపాయాలు, నాణ్యమైన క్రీడా పరికరాల కల్పనకు చర్యలు చేపట్టిందన్నారు.

 

సిఫార్సులతో బంగారు పతకాలు రావు-మంత్రి

 

క్రీడాకారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ సిఫార్సులకు తావులేదని మంత్రి స్పష్టం చేశారు. సిఫార్సులతో ఎంపికైన క్రీడాకారులు బంగారు పతకాలు సాధించలేరని, కేవలం ప్రతిభ ఆధారంగానే ఎంపికలు జరగాలన్నారు. కోచ్‌లు, క్రీడా నిపుణులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, అదే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

 

ఆతిథ్య రాష్ట్రంగా తెలంగాణ సత్తా చాటాలి

 

క్రీడల నిర్వహణకు ఎంత ఖర్చు చేశామన్నది మాత్రమే ముఖ్యం కాదని, ఎన్ని పతకాలు సాధించామన్నదే ముఖ్యమన్నారు. సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ అత్యధిక పతకాలు సాధించేలా కోచ్‌లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా అధికారులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రామసేతు నిర్మాణంలో ఉడుత చేసిన సహాయాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, తెలంగాణ క్రీడాకారుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలన్నారు.

 

ఒలింపిక్స్‌లో తెలంగాణ ప్రతాపం చూపాలి

 

తెలంగాణను క్రీడా రంగంలో అగ్రగామిగా నిలపడంతో పాటు ఒలింపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారులు సత్తా చాటాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలిపారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దే కోచ్‌లకు ప్రభుత్వం సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తుందన్నారు.

 

‘‘మన పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీపై ఎంతో నమ్మకం ఉంచుతున్నాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టండి. తెలంగాణకు పతకాలు సాధించిపెట్టండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’’ అని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.