రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణ దూకుడు
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 26 : రాష్ట్రంలో ఐటీ, ఫార్మా రంగాల కంటే వేగంగా రక్షణ, ఏరోస్పేస్ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో సీఐఐ తెలంగాణ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కాన్‌క్లేవ్–2026ను ఆయన ప్రారంభించారు. ఈ రంగాల్లో ఉత్పత్తి, ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 100 శాతం వృద్ధి సాధిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ రక్షణ, ఏరోస్పేస్ సరఫరా వ్యవస్థల్లో తెలంగాణ కీలక భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. విమాన విడిభాగాలు, రక్షణ ఎలక్ట్రానిక్స్, డ్రోన్లు, రోబోటిక్స్, కృత్రిమ మేధ, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో అపార అవకాశాలున్నాయని తెలిపారు. స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అంతర్జాతీయ తయారీ సంస్థలతో అనుసంధానించి, ప్రపంచ మార్కెట్లకు సరఫరాదారులుగా తీర్చిదిద్దాలని సూచించారు. డిసెంబర్‌లో నిర్వహించనున్న రక్షా ఎక్స్‌పో–2026లో దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు పాల్గొని పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలకు ముందుకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా భారత వైమానిక దళంలో మిగ్–23 యుద్ధ విమాన పైలట్‌గా పనిచేసిన తన అనుభవాలను మంత్రి గుర్తుచేసుకున్నారు.
