జాతీయ స్థాయి ఫిడే చెస్ టోర్నీలో మెరిసిన వేల్పుల అభిజ్ఞా

హైదరాబాద్ వెలుతురు జూలై 12:

హైదరాబాద్‌లో నిర్వహించిన మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు ఆల్ ఇండియా ఓపెన్ ర్యాపిడ్ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్–2026లో యువ చెస్ క్రీడాకారిణి వేల్పుల అభిజ్ఞా ప్రతిభ కనబరిచింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 700 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో అభిజ్ఞా తొలిసారిగా జాతీయ స్థాయి ఫిడే రేటెడ్ పోటీల్లో బరిలోకి దిగింది. ఓపెన్ కేటగిరీలో పోటీ పడుతూ అండర్-7 విభాగంలో 9వ స్థానం సాధించి ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా AIM (అరీనా ఇంటర్నేషనల్ మాస్టర్) వంటి ఉన్నత రేటింగ్ కలిగిన ఆటగాళ్లతో తలపడుతూ విలువైన అనుభవాన్ని సొంతం చేసుకుంది.

టోర్నీలో విజేతలకు మహావీర చక్ర అవార్డు గ్రహీత అమరుడు కల్నల్ సంతోష్ బాబు తల్లిదండ్రులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు కల్నల్ సంతోష్ బాబు దేశసేవను స్మరించుకుని ఆయన త్యాగాలను కొనియాడారు. అనంతరం మాట్లాడిన కల్నల్ సంతోష్ బాబు తండ్రి, “చెస్ కూడా ఒక యుద్ధం లాంటిదే. క్వీన్, రూక్ లేదా నైట్ వంటి కీలక పావులను కోల్పోయినా నిరాశ చెందకుండా, లక్ష్యంపై దృష్టి నిలిపి చివరకు చెక్‌మేట్ సాధించడమే నిజమైన విజయం” అని పేర్కొన్నారు.

తనను ఫిడే రేటెడ్ టోర్నీలో పాల్గొనేలా ప్రోత్సహించి, నిరంతరం శిక్షణ అందించిన చెస్ కోచ్ రవిబాబుకు వేల్పుల అభిజ్ఞా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అభిజ్ఞా ప్రదర్శనపై తల్లిదండ్రులు, కోచ్‌లు, చెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

Leave A Reply

Your email address will not be published.