హైదరాబాద్ / జపాన్, వెలుతురు, అక్టోబర్ 02 : జపాన్‌లోని ఐచి–నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలను తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం వీక్షించింది. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో జపాన్‌లో పర్యటిస్తున్న ఈ బృందం రెండో రోజు పర్యటనలో భాగంగా క్రీడా పోటీలను తిలకించింది. ఈ బృందంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ప్రభుత్వ ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ శివసేన రెడ్డి, వీసీ & ఎండీ సోనీ బాలాదేవి ఉన్నారు. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొస్తున్న భారత క్రీడాకారులతో పాటు తెలంగాణకు చెందిన క్రీడాకారులకు మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణలో క్రీడారంగ అభివృద్ధి, క్రీడాకారులకు మెరుగైన శిక్షణ సదుపాయాలు కల్పించడం, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా యువతను ప్రోత్సహించడం వంటి అంశాలపై ఈ పర్యటన ద్వారా వివిధ క్రీడా వ్యవస్థల అనుభవాలను పరిశీలించే అవకాశం లభించనుంది.
