హైదరాబాద్, అక్టోబర్ 2, వెలుతురు న్యూస్ : మహాత్మా గాంధీ జయంతి యావత్ ప్రపంచానికి పండుగని, శాంతిని కోరుకునే ప్రతి ఒక్కరికీ ఇది స్ఫూర్తిదాయకమైన రోజని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో నిర్వహించిన గాంధీ 157వ జయంతి వేడుకల్లో ఆయన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు జ్యోతి ప్రజ్వలన చేసి గాంధీ జయంతి వేడుకలను ప్రారంభించారు. అనంతరం మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించి, దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన త్యాగాలను, సత్యం, అహింస, శాంతి, సామాజిక సమానత్వం వంటి ఆశయాలను స్మరించుకున్నారు.
మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన మార్గం దేశానికి శ్రీరామరక్ష వంటిదని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేయవచ్చని అన్నారు. గాంధీ మార్గాన్ని అనుసరించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత పటిష్టంగా, ప్రజాకేంద్రంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. గాంధీజీ స్ఫూర్తితో సమాజ సేవలో నిస్వార్థంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. సత్యం, అహింస, శాంతి, సహనం వంటి గాంధేయ విలువలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంతకుముందు ఎల్.బి. స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను నేతలు సందర్శించారు. స్టాల్స్ నిర్వాహకులతో ముచ్చటించి, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలు, ప్రదర్శనల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, వివేక్ వెంకట్ స్వామి, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతు రావు, ఫయీమ్ ఖురేషీ, అంజన్ కుమార్ యాదవ్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
