ఆదిలాబాద్, వెలుతురు, అక్టోబర్ 02 : జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆదిలాబాద్ గాంధీ చౌక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని మహనీయులకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ సత్యం, అహింస, శాంతియుత పోరాటం ద్వారా దేశ ప్రజలను ఏకం చేసి స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారని అన్నారు. హింసకు తావులేకుండా ప్రజల స్వేచ్ఛ కోసం ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి కూడా అనుసరణీయమని పేర్కొన్నారు.
అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి సరళత, నిజాయితీ, క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచారని ఎమ్మెల్యే అన్నారు. దేశానికి క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజల్లో దేశభక్తి, ఐక్యతా భావాన్ని పెంపొందించారని పేర్కొన్నారు. “జై జవాన్, జై కిసాన్” అనే నినాదంతో దేశ రక్షణలో సైనికుల పాత్రను, దేశ ఆహార భద్రతలో రైతుల ప్రాధాన్యతను శాస్త్రిజీ చాటి చెప్పారని అన్నారు. గాంధీజీ చూపిన అహింసా మార్గం, శాస్త్రిజీ చూపిన దేశభక్తి, నిజాయితీ, సేవా భావం నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. వారి ఆశయాలను ఆచరణలో పెట్టడమే వారికి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, లాలా మున్నా. అశోక్. జోగు రవి. సంతోష్.సతీష్. ముకుంద. గంట జీవన్. శ్రీకాంత్ . హనుమల్లు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
