హైదరాబాద్, అక్టోబర్ 2, వెలుతురు : ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మూడేళ్లు గడిచినా నెరవేర్చడం లేదని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలు అల్టిమేటం ఇవ్వడంతో రెండు డీఏలు ఇస్తామని ప్రకటించారని, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ఇవ్వడం దసరా కానుక ఎలా అవుతుందని ప్రశ్నించారు. పీఆర్సీ గడువును ఇంకా ఎన్నిసార్లు పొడిగిస్తారని నిలదీశారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును తిరిగి ఇవ్వడం ప్రభుత్వానికి భారం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఉద్యోగుల హెల్త్‌కార్డులు సక్రమంగా అమలు కావడం లేదని, వెల్‌నెస్ సెంటర్లలో పట్టించుకునే వారు లేరన్నారు. పోలీసులకు గతంలో ఉన్న ఆరోగ్య భద్రతను తొలగించారని ఆరోపించారు. పని చేయించుకోవడంతో పాటు పోలీసులు, వారి కుటుంబాల భద్రతపై డీజీపీ దృష్టి పెట్టాలన్నారు. క్రమశిక్షణ పేరుతో ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. ఒప్పంద ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న హామీపై కేబినెట్‌లో కనీసం చర్చ కూడా జరగలేదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల ఏజెన్సీల నుంచి రూ.1,100 కోట్లు తీసుకున్నట్లు కమిటీ నిర్ధారిస్తే కేసులు, రికవరీ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. ఫార్ములా-ఈ కోసం రూ.45 కోట్లు చెల్లించారంటూ కేటీఆర్‌పై కేసు పెట్టారని, రూ.1,100 కోట్ల వ్యవహారంలో చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఏ మంత్రి తిన్నారు, ఎవరు అడ్డుకున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానం అమలుపై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తూ.. పీఆర్సీ ప్రకటించడమే ఉద్యోగులకు నిజమైన దసరా కానుక అన్నారు. జర్నలిస్టుల హెల్త్‌కార్డులపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కేసీఆర్ హయాంలో జర్నలిస్టులకు హెల్త్‌కార్డులతో పాటు పలు సౌకర్యాలు కల్పించామని, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదన్నారు. జర్నలిస్టులకు వెంటనే హెల్త్‌కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సుమిత్రానంద్, క్యాదాస్ కళ్యాణ్‌కుమార్ పాల్గొన్నారు.
