ఆర్టీసీ–మెట్రో కామన్‌ పాస్‌తో ప్రయాణికులకు మరింత సౌకర్యం

హైదరాబాద్‌: నగరంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చే లక్ష్యంతో ఆర్టీసీ–మెట్రో కామన్‌ పాస్‌ను ప్రారంభించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. కామన్‌ పాస్‌ ప్రారంభం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారంగా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజలను ప్రజా రవాణా వైపు ఆకర్షించేందుకు ఆర్టీసీ, మెట్రో సేవలను సమన్వయంతో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. డైలీ, మంత్లీ పాస్‌లతో పాటు కామన్‌ పాస్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణికుల సమయం, శ్రమ, ఖర్చు ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఒకే పాస్‌తో ఆర్టీసీ, మెట్రో సేవలను వినియోగించుకునే అవకాశం కల్పించామన్నారు. కామన్‌ పాస్‌ సేవను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు మెట్రోలో ప్రయాణించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రయాణికులతో స్వయంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారని చెప్పారు. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా మరింత ప్రయాణ సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో కామన్‌ పాస్‌ను మరింత మెరుగుపరుస్తామని మంత్రి తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.