అంతర్జాతీయ వేదికపై సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

దుబాయ్, అక్టోబర్ 12: తెలంగాణ చేనేత కళా వైభవాన్ని అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పేలా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ రూపొందించిన ప్రత్యేక శాలువా దుబాయ్‌లో ఆకట్టుకుంది. దుబాయ్ పాలక కుటుంబ సభ్యుల చిత్రాలను మగ్గంపై నేసిన ఈ శాలువాను అక్టోబర్ 11న అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్‌లో నిర్వహించిన ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (ETCA) 16వ బతుకమ్మ సంబరాల్లో ఆవిష్కరించారు.

తెలంగాణ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ETCA వ్యవస్థాపక అధ్యక్షుడు పిచ్చిర కిరణ్ కుమార్, అధ్యక్షుడు జగదీష్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గల్ఫ్‌లో నివసిస్తున్న తెలంగాణ కార్మికుల తరఫున దుబాయ్ పాలక కుటుంబానికి గౌరవ సూచకంగా ఈ శాలువాను అందించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కళాఖండం రూపకల్పనకు బలగం టీవీ సీఈఓ బాలు కాయితి, సిరిసిల్లకు చెందిన సివిల్ కాంట్రాక్టర్ జూపల్లి వెంకటరావు ఆర్థిక సహకారం అందించారు. సిరిసిల్ల నేతన్నల ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేలా ఈ ప్రత్యేక చేనేత సృష్టి నిలిచింది.

Leave A Reply

Your email address will not be published.