ఏసీబీ వలలో తహసీల్దార్, సర్వేయర్

రంగారెడ్డి, వెలుతురు అక్టోబర్ 13 : అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వ అధికారులే లంచాల బాట పట్టడం ఆందోళన కలిగిస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అక్రమార్కులపై నిఘా పెంచి, వరుస దాడులు నిర్వహిస్తున్నప్పటికీ కొందరు అధికారుల తీరు మారడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలో భారీ లంచం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఓ లేఅవుట్‌ క్లియరెన్స్‌కు సంబంధించి రూ.20 లక్షల లంచం తీసుకుంటున్న మండల సర్వేయర్‌ శ్రీనివాసులు, తహసీల్దార్‌ సుదర్శన్‌రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం.

 

రూ.30 లక్షల డిమాండ్‌.. రూ.20 లక్షలకు ఒప్పందం

 

అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల పరిధిలోని హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ క్లియరెన్స్‌ వ్యవహారంలో సంబంధిత అధికారులు బాధితుడిని లంచం కోసం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తొలుత సుమారు రూ.30 లక్షలు అడిగి, చివరకు రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం జరగాల్సిన పనికి భారీ మొత్తంలో లంచం అడగడంపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం.బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించి దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో లంచం సొమ్ము తీసుకుంటున్న సమయంలో మండల సర్వేయర్‌ శ్రీనివాసులు, తహసీల్దార్‌ సుదర్శన్‌రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పనులు నిబంధనల ప్రకారం జరగాల్సి ఉండగా, వాటిని పూర్తి చేసేందుకు లంచాలు డిమాండ్‌ చేసినట్లు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.