హైదరాబాద్, వెలుతురు , అక్టోబర్ 13: రోగుల ప్రాణాలు కాపాడాల్సిన దవాఖానలే దోపిడీ కేంద్రాలుగా మారుతున్నాయి. అనుమతులు అంతంతే.. పడకలు మాత్రం వందల్లో! వసతులు అంతంతమాత్రం.. బిల్లులు మాత్రం కార్పొరేట్ స్థాయిలో! అపార్ట్‌మెంట్లలో మల్టీస్పెషాలిటీ బోర్డులు, ఇరుకు గదుల్లో ఐసీయూలు, అర్హతలేని సిబ్బందితో వైద్యం.. ఇలా నిబంధనలకు పాతరేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై నిఘా కొరవడింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌ల ఆగడాలు మితిమీరుతున్నా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా మారిందనే ఆరోపణలున్నాయి. అక్రమాలను అరికట్టాల్సిన డీఎంహెచ్‌వో నిఘా విభాగం నెలవారీ మామూళ్లకే పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడైనా రోగి మృతి చెందితేనో, మీడియాలో కథనాలు వస్తేనో తనిఖీల పేరిట హడావుడి చేయడం.. ఆ తర్వాత తెరవెనుక వ్యవహారాన్ని చక్కబెట్టడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
అనుమతులు అంతంతే.. అక్రమాలు ఇంతింత!
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం ఆస్పత్రుల నిర్వహణలో పడకల సంఖ్య, గదుల విస్తీర్ణం, వైద్య సిబ్బంది, గాలి వెలుతురు తదితర నిబంధనలు పాటించాలి. అయితే కొందరు నిర్వాహకులు తొలుత 20 లేదా 30 పడకలకు తాత్కాలిక అనుమతులు తీసుకుని, ఆ తర్వాత 60 నుంచి 100 పడకలకు విస్తరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సాధారణ అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాల్లో నాలుగు గదులు అద్దెకు తీసుకుని మల్టీస్పెషాలిటీ బోర్డులు తగిలిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్ట్రెచర్‌పై రోగిని తరలించేందుకు కూడా వీల్లేని ఇరుకు గదుల్లో ఐసీయూలు నిర్వహిస్తున్నారు. కనీస వసతులు లేకున్నా కార్పొరేట్ స్థాయిలో బిల్లులు వసూలు చేస్తున్నారు. మరోవైపు అగ్నిమాపక నిబంధనల అమలు ప్రశ్నార్థకంగా మారింది. పొగను గుర్తించే పరికరాలు, మంటలను అదుపు చేసే వ్యవస్థలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు లేకపోవడంతో చిన్నపాటి ప్రమాదం సంభవించినా భారీ ప్రాణనష్టం వాటిల్లే ప్రమాదముంది. 90 శాతం ఆస్పత్రుల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు లేవని, ప్రమాదకర జీవవైద్య వ్యర్థాలు, కలుషిత నీటిని సాధారణ మురుగు కాలువల్లోకి వదులుతున్నారనే ఆరోపణలున్నాయి. ఆస్పత్రుల బోర్డులపై ప్రముఖ వైద్యుల పేర్లు, డిగ్రీలు ప్రదర్శిస్తున్నా లోపల అర్హతలేని ఆర్‌ఎంపీలు, శిక్షణలేని నర్సింగ్ సిబ్బందితో వార్డులు, ఐసీయూలు నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. అత్యవసర చికిత్సలు, ఇంజెక్షన్లు, సెలైన్లు కూడా వారితోనే చేయిస్తూ రోగి పరిస్థితి విషమించగానే పెద్ద ఆస్పత్రులకు పంపుతున్నారని ఆరోపణలున్నాయి. ఇక అనుబంధ మందుల దుకాణాల్లో సరైన అనుమతులు, అర్హత కలిగిన ఔషధ విక్రేతలు లేకుండానే మందులు విక్రయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బయట రాయితీపై లభించే మందులను సైతం ఆస్పత్రిలోనే కొనాలంటూ గరిష్ఠ చిల్లర ధరలకు అంటగడుతున్నారనే ఆరోపణలున్నాయి.
తనిఖీలు నామమాత్రం.. తెరవెనుక ముడుపుల మంత్రం!
ఈ అక్రమాలపై నిరంతర నిఘా ఉంచాల్సిన వైద్యారోగ్య శాఖ అధికారులు ఫిర్యాదులు, ఆందోళనలు వచ్చినప్పుడే తనిఖీల పేరిట హడావుడి చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా కంటితుడుపుగా సంజాయిషీ నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారని, ఆ తర్వాత నెలవారీ ప్యాకేజీలు కుదుర్చుకుని సంబంధిత దస్త్రాలను తొక్కిపెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎల్బీనగర్‌లో గతంలో అనుమతులు రద్దయిన ఓ కేంద్రానికి తిరిగి లైసెన్స్ ఇచ్చేందుకు జిల్లా వైద్యాధికారి స్థాయి వ్యక్తి లక్షల్లో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. మరోవైపు అనుమతులు రద్దయిన ఆస్పత్రుల నిర్వాహకులు బోర్డు పేరు మార్చుకుని తిరిగి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రజారోగ్యంతో ముడిపడిన ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిఘా బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మంజూరైన పడకల సంఖ్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి అదనపు పడకలను తొలగించాలి. అగ్నిమాపక భద్రత, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, భవన అనుమతులు లేని ఆస్పత్రులను మూసివేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలతో పాటు మామూళ్లకు అలవాటుపడిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన నిఘా వ్యవస్థే అవినీతి ఆరోపణల్లో చిక్కుకుంటే రోగులకు రక్షణ ఎక్కడిదన్న ప్రశ్న తలెత్తుతోంది.
