ఉస్మానియాలో వైద్య సేవలకు వెంటిలేటర్‌

హైదరాబాద్‌, అక్టోబరు 12 (వెలుతురు) :  పేదల పాలిట పెద్ద దిక్కుగా నిలవాల్సిన ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య సేవలు మౌలిక సదుపాయాల కొరతతో సతమతమవుతున్నాయని జూనియర్‌ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ నిధులు సకాలంలో విడుదల కాకపోవడం, అత్యవసర మందులు, శస్త్రచికిత్స పరికరాలు అందుబాటులో లేకపోవడం, వైద్య పరీక్షలకు ఆటంకాలు ఎదురవుతుండటంతో రోగులకు సకాలంలో చికిత్స అందడం లేదని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతో సోమవారం నుంచి ఆందోళనకు దిగారు. తొలిదశలో ఔట్‌ పేషెంట్‌ (ఓపీ) సేవలను నిలిపివేసినట్లు ప్రకటించారు. అత్యవసర సేవలకు మాత్రం అంతరాయం కలగకుండా కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.

నిధుల కొరతతో నిలిచిన పరికరాలు

ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోవడంతో రోగులకు అవసరమైన వైద్య సామగ్రి, శస్త్రచికిత్స పరికరాల సరఫరాపై ప్రభావం పడుతోందని జూనియర్‌ వైద్యులు పేర్కొన్నారు. ఆర్థోపెడిక్స్‌ విభాగంలో ఎక్స్‌రే యంత్రం తరచూ మొరాయిస్తోందని, ఎముకల విరుగుళ్లకు కట్లు కట్టేందుకు అవసరమైన ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ కూడా సక్రమంగా సరఫరా కావడం లేదని ఆ విభాగానికి చెందిన డాక్టర్‌ నాజియా తెలిపారు. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అవసరమైన ఇంప్లాంట్లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోలేని పేద రోగులకు వైద్యం అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మందులు సైతం ఆసుపత్రిలో లభించక బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని వివరించారు.

ఎంఆర్‌ఐ కోసం పది రోజుల నిరీక్షణ

న్యూరాలజీ విభాగంలో ఎంఆర్‌ఐ పరీక్షల కొరత రోగుల నిర్ధారణ, చికిత్సకు అడ్డంకిగా మారిందని వైద్యులు చెబుతున్నారు. రోజుకు 50 నుంచి 100 మంది వరకు ఎంఆర్‌ఐ పరీక్షల కోసం వస్తుండగా, ప్రస్తుతం రోజుకు సుమారు 20 పరీక్షలే నిర్వహించగలుగుతున్నామని తెలిపారు. అత్యవసర రోగులకు సైతం పరీక్ష కోసం పది రోజుల వరకు గడువు ఇస్తున్న పరిస్థితి ఉందని పేర్కొన్నారు. యంత్రం పనిచేయకపోవడంతో గత వారం రోజులుగా పరీక్షలు నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర పరీక్షల కోసం ఆరోగ్యశ్రీ పరిధిలోని ప్రైవేటు డయాగ్నస్టిక్‌ కేంద్రాలతో అనుసంధానం చేయాలని కోరారు. అలా చేస్తే రోగులకు ఒకటి, రెండు రోజుల్లోనే పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుందని సూచించారు.

నాలుగేళ్లుగా గుండె శస్త్రచికిత్సలు లేవు

కార్డియోథొరాసిక్‌ సర్జరీ విభాగంలో గత నాలుగేళ్లుగా ఒక్క గుండె శస్త్రచికిత్స కూడా జరగలేదని అక్కడి జూనియర్‌ వైద్యుడు ఆరోపించారు. బైపాస్‌ యంత్రం, పర్ఫ్యూషనిస్ట్‌, పడక పక్కన ఎక్స్‌రే యంత్రం, ద్విమితీయ ఎకో యంత్రం, ఐసీయూ, అత్యవసర పర్యవేక్షణ పరికరాలు అందుబాటులో లేవని వివరించారు. శస్త్రచికిత్స గదుల్లో నీటి సరఫరా కూడా సక్రమంగా లేదని, బకెట్లతో నీటిని నింపుకోవాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ నిధులు అందకపోవడంతో కార్డియాలజీ విభాగంలో యాంజియోగ్రామ్‌, స్టెంటింగ్‌, పీటీసీఏ వంటి చికిత్సలు కూడా దాదాపు మూడు నెలలుగా నిలిచిపోయాయని ఆరోపించారు. నెలకు సుమారు వంద మంది గుండె సంబంధిత రోగులు వస్తున్నప్పటికీ అవసరమైన సదుపాయాలు లేక నిమ్స్‌, గాంధీ ఆసుపత్రులకు పంపించాల్సి వస్తోందన్నారు.

మందులున్నాయా? పరీక్షలున్నాయా?

రోగికి అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉండటం లేదని, వైద్యులు పది రకాల మందులు రాస్తే రెండు, మూడు మాత్రమే ఇచ్చే పరిస్థితి నెలకొందని జూనియర్‌ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రక్తహీనతకు కారణాలు గుర్తించేందుకు అవసరమైన ప్రాథమిక రక్త పరీక్షలు, ఇతర నిర్ధారణ పరీక్షలు సకాలంలో జరగకపోవడంతో చికిత్సలో జాప్యం జరుగుతోందన్నారు. అత్యవసర శస్త్రచికిత్సలకు అవసరమైన కుట్లు వేసే సామగ్రి, గాయాలకు కట్లు కట్టే వస్తువులు, ఇతర పరికరాలు సక్రమంగా లేవని సర్జరీ విభాగం వైద్యులు తెలిపారు. పరీక్షలు, మందుల కోసం పేద రోగులు బయట డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.

వైద్యులకూ కనీస వసతులు కరవు

ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్‌ వైద్యులకు సైతం కనీస సౌకర్యాలు లేవని ఆందోళనకారులు తెలిపారు. తాగునీరు, విశ్రాంతి గదులు, పడకలు, ఫ్యాన్లు వంటి సదుపాయాలు కొరవడ్డాయని, దోమల సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. 24 గంటలతో పాటు కొన్ని సందర్భాల్లో 48 గంటలపాటు విధులు నిర్వహించాల్సి వస్తున్నా విశ్రాంతి తీసుకునేందుకు అనుకూల పరిస్థితులు లేవన్నారు. మరోవైపు గత రెండు, మూడు నెలలుగా ఉపకార వేతనాలు సకాలంలో అందడం లేదని, ఆలస్యంగా విడుదల కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఉపకార వేతనాలను క్రమం తప్పకుండా విడుదల చేయడంతో పాటు కనీసం 40 శాతం పెంచాలని డిమాండ్‌ చేశారు.

హామీ వచ్చే వరకు పోరాటం

ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే విడుదల చేయడం, అత్యవసర మందులు, వైద్య పరీక్షల సామగ్రిని అందుబాటులో ఉంచడం, శస్త్రచికిత్స పరికరాలను సమకూర్చడం, ఎంఆర్‌ఐ సేవలను మెరుగుపరచడం, గుండె వైద్య విభాగాన్ని పూర్తిస్థాయిలో పనిచేయించేలా చర్యలు తీసుకోవడం వంటి డిమాండ్లను జూనియర్‌ వైద్యులు ముందుంచారు. సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. పేద రోగులకు మెరుగైన వైద్యం అందాలంటే ఉస్మానియా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను తక్షణమే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave A Reply

Your email address will not be published.