హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 13: ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన మీడియా సమావేశంలో సింగరేణి కార్మికుల సంక్షేమానికి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న 250–300 డిపెండెంట్ ఆర్డర్లను 15 రోజుల్లో అందజేస్తామని తెలిపారు. కార్మికుల మారుపేర్ల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించడంతో పాటు, అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు, మెరుగైన వైద్య సేవలు, నూతన నివాస సముదాయాలు కల్పిస్తామన్నారు. సింగరేణి కాలనీల ఆధునీకరణ, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, రామగుండంలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు.
