సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు దసరా కానుక

సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు దసరా కానుక..

హైదరాబాద్ : ‎సింగరేణి బొగ్గు గని కార్మికులకు దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న పర్మినెంట్‌ ఉద్యోగులకు లాభాల వాటా కింద ఒక్కొక్కరికి సగటున రూ.1,53,912 చెల్లించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ‎ప్రజాభవన్‌లో మంగళవారం మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటి సిఎం మాట్లాడుతూ మొత్తం 38,737 మంది పర్మినెంట్‌ ఉద్యోగులు ఈ నిర్ణయంతో ప్రయోజనం పొందనున్నారని, 29717 మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున దసరా బోనస్‌ చెల్లించనున్నట్లు తెలిపారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా సింగరేణి లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు లాభాల వాటాగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ ఏడాది సింగ‌రేణి ఆర్జించిన 1754 కోట్ల నిక‌ర లాభాల్లో 34 శాతం అంటే 596 కోట్ల రూపాయ‌ల‌ను లాభాల వాటాగా కార్మికుల‌కు పంపిణీ చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. పర్మినెంట్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. గత ఏడాది కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 బోనస్‌ అందించామని, ఈ ఏడాది కూడా అదే మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించినట్లు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.