మాజీ మంత్రి సబితా హౌస్ అరెస్ట్
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 28 : రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఎలాంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వకపోయినా పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే తన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి పహారా కాశారని తెలిపారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు బాధితుల ప్రజాభిప్రాయ సేకరణతో తనకు సంబంధం ఏమిటని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. తాను ఎలాంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని స్పష్టం చేస్తూ, అలాంటప్పుడు ఏ కారణంతో తనను హౌస్ అరెస్ట్ చేశారో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదని ఆమె పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
