రాహుల్‌గాంధీ పిలుపుతో రామ్‌లీలా మైదానానికి మంత్రి అడ్లూరి
న్యూఢిల్లీ, వెలుతురు, నవంబర్ 01 : ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, ప్రజాస్వామ్య పరిరక్షణ అంశాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రి.. రాత్రి ఢిల్లీలోని హోటల్ అశోకలో బస చేశారు.
ఆదివారం రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డా. కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్‌తో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి బయలుదేరారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను, ఓటు హక్కును పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతోందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరుస్తున్నారని తెలిపారు.
ఓటు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఎన్నికల వ్యవస్థ స్వతంత్రంగా, పారదర్శకంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు.
ప్రజల ఓటు హక్కును కాపాడటం కోసం ఢిల్లీలో జరిగే ఈ పోరాటంలో తెలంగాణ కాంగ్రెస్ తరఫున తమ గళాన్ని బలంగా వినిపిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
