ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోతోంది : భట్టి
న్యూఢిల్లీ, వెలుతురు, నవంబర్ 01: ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం తన స్వతంత్రతను కోల్పోయి బీజేపీ ప్రభుత్వ అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ పేరుతో దేశంలోని అర్హులైన పౌరుల ఓటు హక్కును తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంలోని ఇతర కమిషనర్ల అభిప్రాయాలను సైతం ప్రధాన ఎన్నికల కమిషనర్ పరిగణనలోకి తీసుకోవడం లేదని స్వయంగా కమిషనర్లు పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అన్నారు.
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన ‘చలో ఢిల్లీ – ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీకి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గత ఐదారేళ్లుగా రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాలో అక్రమాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. తొలుత కొందరు ఈ అంశాన్ని రాజకీయ విమర్శగా భావించినప్పటికీ, ఇప్పుడు ఎన్నికల సంఘంలోని సభ్యుల నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ప్రభుత్వ అభిప్రాయాలకు అనుగుణంగా కాకుండా తన స్వతంత్ర నిర్ణయాలతో పనిచేయాలని స్పష్టం చేశారు.
భారత రాజ్యాంగం ప్రతి అర్హత కలిగిన పౌరుడికి సమానమైన ఓటు హక్కును కల్పించిందని, ఆ హక్కును హరించడమంటే ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీయడమేనని భట్టి విక్రమార్క అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి లక్షలాది మంది ప్రాణత్యాగం చేశారని, ఎంతోమంది మహనీయుల కృషి ఫలితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించారని గుర్తుచేశారు.
ఖర్గే, రాహుల్ గాంధీల పిలుపుతో నిర్వహించిన ఈ మహా ర్యాలీ చారిత్రాత్మకమని, ప్రతి పౌరుడికి తన ఓటు హక్కును కాపాడుకోవాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం సాగుతోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి నియోజకవర్గంలో సుమారు 20 వేల నుంచి 25 వేల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. అయినప్పటికీ, 40 వేల నుంచి 60 వేల మెజారిటీ ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారని, ఓట్ల తొలగింపు జరగకపోయి ఉంటే మెజారిటీ మరింత ఎక్కువగా ఉండేదని వివరించారు. సాధారణంగా ఎన్నికల్లో గెలుపొందిన, ఓడిపోయిన అభ్యర్థుల మధ్య 10 వేల నుంచి 20 వేల ఓట్ల వ్యత్యాసమే ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో 20 వేల నుంచి 25 వేల ఓట్ల తొలగింపు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
