సన్నబియ్యం గరిష్ట ధరలు ఖరారు
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 01 : తెలంగాణలో సన్నబియ్యం విక్రయాలకు గరిష్ట ధరలను పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. వివిధ రకాల సన్నబియ్యానికి రకం ఆధారంగా గరిష్ట ధరలను ఖరారు చేస్తూ మిల్లర్లు, ట్రేడర్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని బియ్యం దుకాణాల్లోనూ నిర్ణయించిన ధరలకే విక్రయించాలని స్పష్టం చేసింది.
BPT, KNM రకం సన్నబియ్యం కిలో గరిష్ట ధరను రూ.66గా నిర్ణయించారు. తెలంగాణ సోనా, RNR రకం బియ్యం కిలో రూ.74గా, HMT, JSR రకం సన్నబియ్యం కిలో రూ.79గా ధరలు ఖరారు చేశారు.
నిర్ణయించిన గరిష్ట ధరలకు మించి బియ్యాన్ని విక్రయిస్తే సంబంధిత మిల్లర్లు, ట్రేడర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ హెచ్చరించింది. వినియోగదారులపై అధిక ధరల భారం పడకుండా బియ్యం విక్రయాలపై నిఘా కొనసాగించాలని అధికారులకు సూచించింది.
