కండక్టర్ ప్రవళిక మృతి.. రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 04 : మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక మృతి తనను తీవ్రంగా కలచివేసిందని, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇటీవల ప్రయాణికులతో జరిగిన వివాదం నేపథ్యంలో బస్సు టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడిన ప్రవళికకు హైదరాబాద్లోని సాయి సంజీవని ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించినట్లు మంత్రి తెలిపారు. ఆమె ఆరోగ్యం కుదుటపడి తిరిగి విధుల్లోకి వస్తారని ఆశించామని, అయితే చికిత్స పొందుతూ మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రవళిక మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలిపారు.
ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం ప్రత్యేక భరోసా
ప్రవళిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు, కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున కలిపి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు తెలిపారు.
ఈ విషాద సమయంలో ప్రవళిక కుటుంబం ఒంటరిది కాదని, ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం వారికి అండగా నిలుస్తాయని మంత్రి భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించి అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు.
