కేటీఆర్‌కు కళాకారుల గురించి మాట్లాడే అర్హత లేదు : మెట్టు

కేటీఆర్‌కు కళాకారుల గురించి మాట్లాడే అర్హత లేదు : మెట్టు

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 04 :  అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో కవులు, కళాకారులను పట్టించుకోని బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు వారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని టీపీసీసీ ఫిషర్మెన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కళాకారులు సిద్ధమయ్యారని ఆయన తెలిపారు.

 

కళాకారులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయమే ఆ పార్టీ పతనానికి కారణమైందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ గాయకుడు గద్దర్‌ను కేసీఆర్ అవమానించిన విషయాన్ని కళాకారులు ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ పేరుతో అవార్డులు అందిస్తూ కళాకారులకు గౌరవం కల్పిస్తున్నారని పేర్కొన్నారు.

 

అలాగే అందెశ్రీ రచించిన పాటను రాష్ట్ర గీతంగా గుర్తించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, ప్రముఖ కవి గోరేటి వెంకన్నకు కోటి రూపాయల నజరానా అందించి గౌరవించిన ఘనత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని సాయికుమార్ అన్నారు.

 

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన మోసాలు, కళాకారులకు జరిగిన అన్యాయంపై గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌కు మరో 14 ఏళ్ల వనవాసం తప్పదని జోస్యం చెప్పారు.

 

కేటీఆర్ కళాకారుల గురించి మాట్లాడటం వారిని మరోసారి అవమానించడమేనని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో దోపిడీకి, మోసాలకు గురికాని వర్గం లేదని ఆరోపించారు. తెలంగాణ కులగణనలో కల్వకుంట్ల కుటుంబం భాగస్వామ్యం కానప్పుడు, ఆ కుటుంబానికి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని మెట్టు సాయికుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.