తెలంగాణ కవులు, కళాకారులు మళ్లీ గళమెత్తాలి: కేటీఆర్

తెలంగాణ కవులు, కళాకారులు మళ్లీ గళమెత్తాలి: కేటీఆర్

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 04 :  సమాజాన్ని చైతన్యం చేయాల్సిన బాధ్యత తెలంగాణ కవులు, కళాకారులదేననీ, వారంతా ఐక్యమై మళ్లీ గళమెత్తాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ వికాససమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ భవన్ లో మంగళవారం జరిగిన ప్రజాకవి, గోదావరి గొంతుక మల్లావఝుల సదాశివుడు అవార్డు ప్రదానోత్సవ సభలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇవాళ రాష్ట్రంలో వచ్చింది ఎల్ నినో కరువు కాదని, ఈ పాలకులు తెచ్చిన కరువు అని, కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరం నీళ్లు ఆపకుండా, రిజర్వాయర్లలో, చెరువుల్లో నింపకుండా తెలంగాణను ఎండబెడుతున్నారని కేటీఆర్ అన్నారు.

 

సమైక్య రాష్ట్రం నాటి కరువుతో.. మల్లావఝుల పాట అవసరం మళ్లీ వచ్చింది

‘తలాపునా పారుతుంది గోదారీ.. నా చేనూ, నా చెలకా ఎడారీ’ అని మల్లావఝుల సదాశివుడు దశాబ్దాల క్రితం సమైక్య రాష్ట్రం నాటి పరిస్థితులకు అనుగుణంగా రాసిన పాట అవసరం మళ్లీ వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ గారి ముందుచూపుతో మిషన్ కాకతీయతో చెరువుల పూడికతీత, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో పదేళ్లపాటు రైతుల పంటలకు పుష్కలంగా నీళ్లు అంది ఏ రంధిలేకుండా వ్యవసాయం చేసుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఏడాదికి రెండు పంటలు కలిపి మూడుకోట్ల టన్నుల వరిధాన్యం పంట పండి, తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇవాళ ఈ పాలకుల ముందుచూపు లేక కరువు పరిస్థితులు నెలకొన్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీళ్లు రైతులకు వరంగా మారితే, ఇపుడు ఈ పాలకులు నదుల్లో నీళ్లు వృథాగా పోతున్నా, ఆ నీళ్లను ఆపి, రిజర్వాయర్లు నింపి, చెరువులను నింపకపోవడంతో రాష్ట్రం కరువుపాలైందన్నారు. అందుకే తెలంగాణ కవులు, కళాకారులు ఇవాళ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సాహిత్య ఉద్యమం చేయాలని కేటీఆర్ కోరారు. మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారాన్ని 2024–25 సంవత్సరానికి ప్రముఖ కవి, కథారచయిత డాక్టర్ చమన్ కు, 2025–26 సంవత్సరానికి సామాజిక విమర్శకులు, పరిశోధకులు డాక్టర్. సంగిశెట్టి శ్రీనివాస్ కు అవార్డును, నగదు పురస్కారాన్ని కేటీఆర్ అందజేశారు. రచయిత్రి తిరునగరి దేవకీదేవి, ప్రజా గాయకుడు కవ్వంపల్లి స్వామిలకు కేటీఆర్ చేతుల మీదుగా ప్రత్యేక సత్కారం చేసి, నగదును అందజేశారు. తెలంగాణ వికాస సమితి గౌరవ అధ్యక్షులు, కవి, గాయకులు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సమితి అధ్యక్షులు వనపట్ల సుబ్బయ్య, తెలంగాణ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, టీఎన్జీఓల జేఏసీ మాజీ ఛైర్మన్ దేవీ ప్రసాద్, రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ మాజీ ఛైర్మన్ ఆయాచితం శ్రీధర్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు విరాహత్ అలీలతోపాటు, కీ.శే. మల్లావఝల కుమారులు విజయానంద్, వంశీ, కుమార్తె కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.