ఎల్ నినో ప్రభావంపై అధికారులతో సమీక్ష
నకిరేకల్, వెలుతురు, నవంబర్ 04 : ఎల్ నినో ప్రభావంతో ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నకిరేకల్ నియోజకవర్గ స్థాయిలో ఎల్ నినో ప్రభావం, నివారణ చర్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశంతో కలిసి వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ శాఖతో పాటు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.
సమావేశంలో నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, అదనపు కలెక్టర్లు, అసిస్టెంట్ కలెక్టర్, DRDO అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
