రూ.13,060 కోట్లతో 6,092 కి.మీ. రోడ్ల అభివృద్ధి 

రూ.13,060 కోట్లతో 6,092 కి.మీ. రోడ్ల అభివృద్ధి

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 19 : తెలంగాణలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మూడు కీలక రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం త్వరగా అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. హైదరాబాద్‌లో జరుగుతున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం, హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి ఆరు లేన్ల విస్తరణ, హైదరాబాద్–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్–విజన్ 2047లో భాగంగా రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 441 రోడ్లను 6,092 కిలోమీటర్ల మేర రూ.13,060 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, 15 ఏళ్ల పాటు వాటి నిర్వహణ బాధ్యత కూడా చేపడుతున్నామని వెల్లడించారు. రోడ్ల నిర్మాణంలో ఆధునిక సాంకేతికత, నాణ్యత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ సురక్షితంగా నడిచే హక్కు కల్పించాలని, ఫుట్‌పాత్‌లు, నడక మార్గాలను అభివృద్ధి చేయాలని సూచించారు. సమావేశంలో భాగంగా 400 స్టాళ్లతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో 104 దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. రోడ్డు భద్రత, నాణ్యత విషయంలో రాజీ పడరాదని, ప్రజాధనంతో చేపట్టే పనులు మన్నికగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.