రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టోలిచౌకి సీఐ

రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టోలిచౌకి సీఐ

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 19 :  లంచం తీసుకుంటూ టోలిచౌకి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎల్. రమేష్ నాయక్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్‌లోని తన కార్యాలయంలో ఓ హోటల్ నిర్వాహకుడి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

 

వివరాల ప్రకారం.. రాత్రి ఒంటి గంట తర్వాత కూడా హోటల్ నిర్వహించుకునేందుకు అనుమతిస్తానని చెప్పి నెలకు రూ.50 వేల చొప్పున మామూళ్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్టోబర్ 31న ఫిర్యాదుదారుడి నుంచి ఇప్పటికే రూ.20 వేలు తీసుకున్నట్లు సమాచారం. తాజాగా మరో రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా సీఐ క్యాబిన్‌లోని సంచిలో నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తనిఖీల్లో రూ.1 లక్ష, రూ.50 వేలు, రూ.20 వేలు, రూ.15 వేల చొప్పున నాలుగు కవర్లలో ఉన్న మొత్తం రూ.1.85 లక్షలను గుర్తించారు. ఈ నగదుకు సంబంధించిన వివరాలపై అధికారులు విచారణ చేపట్టారు. సీఐని అదుపులోకి తీసుకుని తదుపరి చర్యలు చేపట్టినట్లు సమాచారం.