నీటి వాటాలో రాజీ ప్రసక్తే లేదు : మహేష్ కుమార్ గౌడ్

నీటి వాటాలో రాజీ ప్రసక్తే లేదు : మహేష్ కుమార్ గౌడ్

 

హైదరాబాద్‌, వెలుతురు, నవంబర్ 19 :  కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. నీటి విషయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన తప్పిదాలు, తెలంగాణకు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆ పార్టీ నేతలు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. కేటీఆర్‌ చేస్తున్నదంతా రాజకీయ డ్రామా అని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది కేసీఆర్‌ ప్రభుత్వమేనని ఆరోపించారు. కళ్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌, షాదీముబారక్‌ పథకాల బిల్లులను కాంగ్రెస్‌ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

 

తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో రాజీ ఉండదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారని చెప్పారు. నాగార్జునసాగర్‌ నుంచి నీటి తరలింపును అడ్డుకున్నది కాంగ్రెస్‌ పార్టీయేనని పేర్కొన్నారు. ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించేందుకు అభ్యంతరం లేదని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం లేఖలు రాసిందని, తెలంగాణ అభ్యంతరాల కారణంగానే ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు నిలిచిపోయాయని వెల్లడించారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

 

డ్యామ్‌లపై కేంద్ర బలగాలు, కేఆర్‌ఎంబీ నియంత్రణ కేంద్రం చేతిలో ఉన్నప్పటికీ బీజేపీని ప్రశ్నించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మాత్రమే బద్నాం చేయడం వెనుక బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. దక్షిణ తెలంగాణకు వరప్రదాయినిగా నిలిచే ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను పదేళ్లపాటు పక్కనపెట్టారని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధించడంలో విఫలమయ్యారని విమర్శించారు. పదేళ్లపాటు కృష్ణా బేసిన్‌ను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.

 

రూ.1.84 లక్షల కోట్ల వృథా

 

బీఆర్‌ఎస్‌ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో సుమారు రూ.1.84 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌, ఆర్డీఎస్‌ ఆధునీకరణ, డిండి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే రాష్ట్రంలో సాగునీటి విస్తీర్ణం గణనీయంగా పెరిగేదన్నారు. కృష్ణా జలాల విషయంలో గత ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని, నాడు 36 శాతం వాటా చాలంటూ కేసీఆర్‌ అంగీకరించారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం 70 శాతం వాటా కోసం పోరాడుతోందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఏపీ 4,464 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకోగా, తెలంగాణకు కేవలం 1,993 టీఎంసీలే దక్కాయని పేర్కొన్నారు.

 

కాళేశ్వరం ప్రాజెక్టును లోపభూయిష్టంగా నిర్మించారని, ఈ విషయాన్ని జాతీయ ఆనకట్టల ప్రాధికార సంస్థ, జాతీయ స్థాయి నిపుణులు ధ్రువీకరించారని అన్నారు. నెహ్రూ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు దేశానికి దేవాలయాలుగా నిలిచాయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న చౌకబారు ప్రకటనలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు.

 

పార్టీ నేతల వ్యాఖ్యలపై అధిష్ఠానం దృష్టి

 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తామని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించిందని, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌ కొత్త ఇన్‌చార్జి సందీప్‌ నిబద్ధత కలిగిన నాయకుడని ఆయన పేర్కొన్నారు.