రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 26 :
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లో నిర్వహించిన సంవిధాన్ రక్షా మార్చ్ – రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల సంరక్షణ, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి మౌలిక సూత్రాల ప్రాధాన్యతను చాటిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ,ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని తెలిపారు.. రాహుల్ గాంధీ నాయకత్వంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుంటూ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
