హైదరాబాద్ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 27 : విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, పరిశోధనాత్మక, విమర్శనాత్మక ఆలోచనా విధానాలను పెంపొందించడంతో పాటు, వారి ఆవిష్కరణ సామర్థ్యాన్ని వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్లు అత్యంత కీలకమైన వేదికలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలని, విద్యార్థులు తమలోని జిజ్ఞాసను, పరిశోధనా తృష్ణను నిరంతరం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
ఇర్రంమంజిల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 54వ హైదరాబాద్ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రయోగాలను పరిశీలించి, వాటి పనితీరు, ఉపయోగాలు, తయారీ విధానాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆలోచనా శక్తి, సృజనాత్మకత, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ జిల్లాలో ఐదు విభిన్న కార్యక్రమాల ద్వారా మొత్తం 392 వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ స్థాయి ప్రదర్శనల వెనుక విద్యార్థుల కృషితో పాటు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, విద్యాశాఖ అధికారుల సమిష్టి కృషి, అంకితభావం ఉన్నాయని పేర్కొంటూ వారందరికీ అభినందనలు తెలిపారు.
