ఎస్ఐఆర్పై పోరాటాన్ని ఉధృతం చేయాలని విపక్షాల నిర్ణయం
ఢిల్లీ: ఎస్ఐఆర్ (SIR) అంశంపై ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆందోళనలను ఉధృతం చేయాలని విపక్ష ఎంపీలు నిర్ణయించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసంలో జరిగిన విపక్ష ఎంపీల సమావేశంలో ఈ మేరకు కీలక అంశాలపై చర్చించారు. దసరా, దీపావళి పండగల నేపథ్యంలో నిరసనలకు తాత్కాలిక విరామం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. పండగలు ముగిసిన తర్వాత మళ్లీ ఆందోళనలు చేపట్టే అవకాశాలపై నేతలు చర్చించారు. సోమవారం నిర్వహించిన నిరసనకు వచ్చిన స్పందనపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఎస్ఐఆర్ అంశంపై సుప్రీంకోర్టుకు వినతిపత్రం సమర్పించిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపైనా చర్చించారు. మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ ఆందోళనలకు దూరంగా ఉండటంపై కూటమి నేతల్లో అసంతృప్తి వ్యక్తమైనట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణ, ఆందోళనలను మరింత విస్తృతం చేసే అంశాలపై విపక్ష నేతలు చర్చించినట్లు సమాచారం
